ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్గు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తూ.. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అదే రోజే విద్యా కానుకను ప్రారంభించి, నూతన విద్యా విధానం విధి, విధానాలను ప్రకటిస్తామని చెప్పారు. విద్యా శాఖ, అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు, నూతన విద్యా విధానం, విద్యా కానుక అంశాలపై జూలై 23న శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే త్వరితగతిన ఆ ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే నెల 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలని సీఎం ఆదేశించారు.
- ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా అంగన్వాడీల నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభం అవుతుంది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయి. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌కు ఫౌండేషన్ స్కూల్స్ మార్గ నిర్దేశం చేస్తాయి. ఇక్కడ కూడా ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షిస్తూ ఉత్తమ బోధన అందేలా చూస్తారు.
- శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుంది. మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం.
- నూతన విద్యా విధానం పట్ల మొగ్గు చూపుతున్నామనేదానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఫౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా? లేదా? (విస్తృతంగా చర్చించామని అధికారులు చెప్పారు)
- ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు వారికీ తెలియాలి. ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి.
- అంగన్వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్ చానల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ, జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా వ్యవస్థ ఉంటుంది. ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం.
- మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలి. పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండరాదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం గతంలో లేదు.
- పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు. ఈ విషయం పై స్థాయి హెడ్ మాస్టర్ నుంచి కింద స్థాయి వారి వరకు వర్తిస్తుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా చెబుతున్నా.
- పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక.. తదితరాలన్నీ ఆగస్టు 16 నాటికి సిద్ధంగా ఉండాలి.